Jump to content

దేవులపల్లి కృష్ణశాస్త్రి

వికీపీడియా నుండి
దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
జననందేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
నవంబర్ 1, 1897
రావు వారి చంద్రంపాలెం , పిఠాపురం దగ్గర
మరణంఫిబ్రవరి 24, 1980
నివాస ప్రాంతంరావు వారి చంద్రంపాలెం , పిఠాపురం దగ్గర , తూర్పు గోదావరి జిల్లా
వృత్తిపెద్దాపురం మిషన్ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయుడు
ప్రసిద్ధితెలుగు సినిమా పాటల రచయిత
మతంహిందూ
భార్య / భర్తరాజహంస(మ.2002)[1]
పిల్లలుకొడుకు - దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి (బుజ్జాయి),
కూతురు -సీత
దేవులపల్లి కృష్ణశాస్త్రి రేఖాచిత్రం
కృష్ణపక్షము

దేవులపల్లి కృష్ణశాస్త్రి (నవంబర్ 1, 1897 - ఫిబ్రవరి 24, 1980) తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ముఖ్య అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించారు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించారు.

జీవిత విశేషాలు

[మార్చు]

దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించారు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించారు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నారు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరారు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టారు.

ఆ కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నారు. అదే సమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించారు. 1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం ఆయన రచనలలో విషాదం అధికమయ్యింది.

తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరారు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించారు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే "ఊర్వశి" అనే కావ్యం వ్రాశారు.

1929లో విశ్వకవి రవీంద్రనాధ టాగూరుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టారు. 1942లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశారు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించారు. 1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించారు.[2][3]

భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి... బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి (1951)’తో చిత్రరంగంలో అడుగుపెట్టారు. సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. ఆపాత మధురమైన కృష్ణశాస్ర్తి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని శ్రీశ్రీ శ్లాఘించారు. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం - కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం. రాజమకుటం, సుఖదుఃఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన కృష్ణశాస్ర్తి, ఈ పన్నెండుగురు పద నిర్దేశకుల్లోనూ తక్కువ పాటలు రాసిన కవి.

‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ...దేవులపల్లి కృష్ణశాస్త్రి.

గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. కాని ఆయన రచనా పరంపర కొనసాగింది. ఆయన కి అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించారు.

కృష్ణశాస్త్రి మేనగోడలే కర్ణాటక, లలిత, జానపద సంగీత కళానిధి, వింజమూరి సోదరీమణులలో ఒకరైన కళాప్రపూర్ణ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి.

పురస్కారాలు

[మార్చు]

ప్రముఖుల అభిప్రాయాలు

[మార్చు]
  • మహాకవి శ్రీశ్రీ - నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని. కానీ, మా నారాయణబాబు కృష్ణశాస్త్రి సింహం జూలునుకూడా అనుసరించి, దాన్ని రోజూ సంపెంగ నూనెతో సంరంక్షించుకునేవాడు. నాకెప్పుడూ పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద ఉండేదికాదు.
  • విశ్వనాథ సత్యనారాయణ - మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా యభిప్రాయము.

రచనలు

[మార్చు]
  • కృష్ణ పక్షము: ఇది కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. 1922లో సంభవించిన భార్యా వియోగం ఆయన కవితలను మరింత వేదనా భరితం చేసింది.ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము[4], ఊర్వశి వంటి కవితలు ఈ ఖండకావ్యసంపుటిలో ఉన్నాయి.
  • ఊర్వశి కావ్యము,[5]
  • అమృతవీణ - 1992 - గేయమాలిక
  • అమూల్యాభిప్రాయాలు - వ్యాసావళి
  • బహుకాల దర్శనం - నాటికలు,కథలు
  • ధనుర్దాసు - నాలుగు భక్తీ నాటికలు,
  • కృష్ణశాస్త్రి వ్యాసావళి - 4 భాగాలు
  • మంగళకాహళి - దేశభక్తి గీతాలు
  • శర్మిష్ఠ - 6 శ్రవ్య (రేడియో) నాటికలు
  • శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, నాటిక 1993
  • మేఘమాల - సినిమా పాటల సంకలనం - 1996
  • శ్రీ విద్యావతి - శృంగార నాటికలు
  • యక్షగానాలు - అతిథిశాల - సంగీత రూపకాలు
  • మహాతి
  • వెండితెర పాటలు - 2008

సినిమా పాటల

[మార్చు]

మల్లీశ్వరితో ప్రారంభించి కృష్ణశాస్త్రి ఎన్నో చక్కని సినిమా పాటలు అందించారు. అవి సామాన్యులనూ, పండితులనూ కూడా మెప్పించే సాహితీ పుష్పాలు. ఉదాహరణకు

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ అనే గీతాన్ని ఆయన కాకినాడ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నపుడు వారి విద్యార్థుల కోసం వ్రాసారు.

కృష్ణపక్షము నుండి

[మార్చు]

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?
నా యిచ్చయే గాక నా కేటి వెరపు ?
కాలవిహంగమ పక్షముల దేలియాడి
తారకా మణులలో తారనై మెరసి
మాయ మయ్యెదను నా మధురగానమున!
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ? (స్వేచ్ఛాగానము)

తలిరాకు జొంపముల సం
దులత్రోవల నేల వాలు తుహినకిరణ కో
మల రేఖవొ! పువుదీవవొ!
వెలదీ, యెవ్వతెవు నీపవిటపీ వనిలోన్ ? (అన్వేషణము)

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను? (ఏల ప్రేమింతును?)

ప్రసిద్ధి చెందిన సినిమా పాటలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బాధ ఒక వరం. దానికి చాలా శక్తులు ఉన్నాయి. బాధలో కాలిపోయేవారు పాషానులు కాలేరు. వారు నిలువునా నవనీతం.

            దేవులపల్లి కృష్ణశాస్త్రి

మూలాలు, వనరులు

[మార్చు]
  1. obituray,published on 23rd May 2002
  2. రేవూరి, అనంత పద్మనాభరావు (1996). "Wikisource link to హైదరాబాదు కేంద్రం". Wikisource link to ప్రసార ప్రముఖులు. వికీసోర్స్. 
  3. రామసూరి, సీతారామయ్య. "కృష్ణశాస్త్రి జీవితం – సాంస్కృతిక నేపథ్యం". వాకిలి. Retrieved 28 December 2018.[permanent dead link]
  4. https://www.kahaniya.com/s/pravaasamu-1929
  5. https://www.kahaniya.com/s/urvashi-6051

బయటి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.