Jump to content

బందా సింగ్ బహదూర్

వికీపీడియా నుండి
బందా సింగ్ బహదూర్
జననం27 అక్టోబర్ 1670
మరణం9 June 1716 (1716-06-10) (aged 45)
ఇతర పేర్లుమాధవ్ దాస్
క్రియాశీల సంవత్సరాలు1708-1716
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మొఘల్ సామ్రాజ్యంపై పోరాటం
జమీందారీ వ్యవస్థ రద్దు చేసి, వాజీర్ ఖాన్ ను చంపి, పంజాబ్ లో ఖల్సా పాలను స్థాపించారు.[1]
తరువాతివారుఛజ్జా సింగ్ దిల్లాన్
పిల్లలు1 (అజయ్ సింగ్)

బందా సింగ్ బహదూర్ (జన్మనామం లచ్మణ్ దేవ్, బందా బహదూర్, [2] లచ్మణ్ దాస్, మాధవ్ దాస్[3][4] పేర్లతోనూ ప్రఖ్యాతుడు) (27 అక్టోబరు 1670 – 9 జూన్ 1716, ఢిల్లీ) సిక్ఖు సైన్యాధ్యక్షుడు, నాయకుడు.

15వ ఏట ఇల్లు విడిచి సన్యసించి, మాధవ్ దాస్ అన్న దీక్షానామం స్వీకరించారు. గోదావరి తీరంలో గల నాందేడ్ ప్రాంతంలో ఒక మఠాన్ని స్థాపించారు. సెప్టెంబరు 1708లో ఆయనను తన ఆశ్రమంలో గురు గోవింద సింగ్ సందర్శించారు, తదనంతరం ఆయనకు మాధవ్ దాస్ శిష్యుడయ్యారు. ఆ సందర్భంగా బందా సింగ్ బహదూర్ అన్న పేరును గురు గోబింద్ సింగ్ ఈయనకు పెట్టారు. గురు గోబింద్ సింగ్ ఇచ్చిన దీవెనలు, అధికారంతో బందా సింగ్ బహదూర్ ఓ సైన్యాన్ని పోగుచేసి, మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. 1709 నవంబరులో ముఘల్ ప్రావిన్షియల్ రాజధాని అయిన సమానాను ముట్టడించి, విజయం సాధించి తన తొలి ప్రధాన విజయాన్ని నమోదుచేశారు.[3] పంజాబ్ లో అధికారాన్ని స్థాపించాకా ఆయన జమీందారీ వ్యవస్థను రద్దుచేసి, సాగుచేసుకుంటున్న రైతులకే భూమిని పంచిపెట్టారు. 1716లో మొఘలులు ఆయన్ను బంధించి, చిత్రహింసలు పెట్టి చంపారు.

జీవిత చరిత్ర

[మార్చు]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

బందా సింగ్ బహదూర్ ఎక్కడివారు అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి:

  • భాయ్ కహాన్ సింగ్ నభా రాసిన మహాన్ కోశ్ అన్న సిక్ఖు విజ్ఞాన సర్వస్వం ప్రకారం - ఆయన జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ కానీ, పంజాబ్ లోని దౌబాకి కానీ చెందిన మిన్హాస్ రాజ్ పుత్.
  • పి.ఎన్.బలి ఆయనను మొహ్యాల్ బ్రాహ్మణుడిగా భావించారు.[5] బలి రాసిన మోహ్యాల్ హిస్టరీ పుస్తకం ప్రకారం జమ్మూ కాశ్మీర్ లోని శివాలిక్ పర్వత శ్రేణుల వద్ద గల బందా పూంఛ్ తాలూకాలోని మెంధర్ జిల్లాలో 1670 అక్టోబరు 27న జన్మించారు.
  • హరీం రాయ్ ఆయనను పంజాబీ ఖత్రీ లేక రాజ్ పుత్ గా భావించారు.[6]
  • జైనీ బుధ్ సింగ్ అనే సుప్రసిద్ధ పండితుడు తన ప్రఖ్యాత గ్రంథం ఛొవెన్ రతన్లో బందా బహదూర్ పుట్టుకతో బ్రాహ్మణుడని భావించారు.
  • హర్జీందర్ సింగ్ దిల్జీర్ తన పుస్తకం సిక్ఖు త్వారీఖ్ (1469-2008) (అమృత్ సర్ సింగ్ సోదరులు, 2008లో 5 సంపుటాల గ్రంథంగా ప్రచురించారు) లో బందా సింగ్ ను పుట్టుకతో రాజపుత్ గా పేర్కొన్నారు. 1670లో లచ్మణ్ దాస్ గా జన్మించిన ఆయన 16వ యేట ఇంటిని వదిలి, దిమ్మరులైన హిందూ సాధువుల గుంపులో కలిసిపోయారు. ఆయన రెండు సంవత్సరాల కాలాన్ని ఇద్దరు సాధువుల (జానకీ దాస్ తర్వాత రాందాస్) వద్ద గడిపారు, ఆపైన బాబా లూనియాను, బుర్హాన్ పూర్ వద్ద కలుసుకున్నారు. 1696లో ఆయన [[గురు గోవింద్ సింగ్]]ను కన్ఖల్, హరిద్వార్ వద్ద కొద్ది సమయం కలుసుకున్నారు. ఈ సంఘటన తర్వాత ఆయనను గోవింద్ సింగ్ ఆగస్టు 1708లో సందర్శించారు. అయితే దల్జీర్ వ్రాసిన ఈ కథనాన్ని కొందరు సిక్ఖులు సవాలుచేశారు.[7][8]

యువకునిగా ఆయన కుస్తీ, గుర్రపు స్వారీ, వేట ప్రధానమైన వ్యాపకాలుగా గడిపారు. ఒకసారి పావురాన్ని గురిచూసి కొట్టగా, దాని తల్లి బాధ తట్టుకోలేక మరణించడం చూశారు. దాంతో మనసు మారి, ఆ క్రమంలో ఇల్లు వదిలివేసి, సన్యాసం స్వీకరించి బైరాగి జానకీ దాస్ శిష్యుడయ్యాడు, అప్పుడే ఆయనకు మాధవ్ దాస్ అన్న దీక్షానామం ఇచ్చారు. సాధువుల సాంగత్యంలో దేశంలో ఎన్నో ప్రదేశాలు తిరిగి, చివరకు గోదావరి తీరంలోని నాందేడ్లో ఆశ్రమం నిర్మించి నివసించారు.

తొలి పోరాటాలు

[మార్చు]

గురు గోవింద్ సింగ్ ను 1708 సెప్టెంబరు 3న కలిశాకా ఆయన సిక్ఖు మతం స్వీకరించారు.[3] గురువు ఆయన పేరు బందా సింగ్ బహదూర్ గా మార్చి, పంజాబ్ చేరుకుని మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా సిక్ఖు సైన్యం సహకారంతో పోరాడమని ఆదేశించారు. బందా సింగ్ బహదూర్ సోనీపట్ వద్ద ఖార్ ఖోడా వద్ద స్థావరాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఆయన సోనిపట్ యుద్ధంలో పోరాడి, [9] సోనిపట్, కైతా ప్రాంతాలు గెలిచారు.[10] 1709లో మొఘల్ సామ్రాజ్యపు పంజాబ్ సుబా రాజధాని సమానాను ముట్టడించి, సుమారు 10వేలమంది మహమ్మదీయులను యుద్ధంలో చంపి, మొఘల్ సైన్యంపై నిర్ణయాత్మక విజయం సాధించారు. దీంతో సమానా నగరం ఆయనకు లభించింది.[11][12] సమానా నాణేల ముద్రణకు పేరొందింది. అక్కడున్న ఖజానా లభించడంతో సిక్ఖులు ఆర్థికంగా నిలకడ సాధించారు. ఆపైన సిక్ఖులు కొద్దికాలానికే ముస్తఫాబాద్, [3] సాధోరాలను గెలుచుకున్నారు.[13] సిక్ఖులు ఆపైన గుర్హాం, కపోరీ, బనూరి, మలెర్కోట్ల, నహాన్ సహా పంజాబ్ లోని సిస్-సట్లెజ్ ప్రాంతాన్ని పట్టుకున్నారు. 1710 మే 12లో చప్పర్ చిరి యుద్ధంలో సిక్ఖులు గురు గోవింద్ సింగ్ చిన్న కుమారులు అమరులు కావడానికి కారణమైన సిర్హింద్ గవర్నర్ వాజిర్ ఖాన్ ను, దివాన్ సుచానంద్ ను చంపారు. రెండు రోజుల తర్వాత సిక్ఖులు సిర్హింద్ ను పట్టుకున్నారు. దాంతో బందా సింగ్ అధీనంలోకి సట్లెజ్ నుంచి యమున వరకూ వచ్చాయి. తన రాజ్యంలో జమీందారీ వ్యవస్థను రద్దుచేసి, రైతులు ఆత్మగౌరవంతో, మర్యాదతో జీవించాలంటూ వారికి భూములు పంచిపెట్టారు.[14]

బందా సింగ్ సిక్ఖు రాజ్

[మార్చు]

బందా సింగ్ ముఖ్లిస్ ఘర్ అనే గ్రామాన్ని అభివృద్ధి చేసి తన రాజధాని చేసుకున్నారు. అతను నగరాన్ని లోహ్ ఘర్ (ఉక్కు కోట) గా పేరుపెట్టారు. అక్కణ్ణుంచి తన నాణాలను తాను జారీచేశారు.[15] నాణెంపై లోహ్ ఘర్ గురించి: శాంతి అన్న నగరంలో, నాగరిక జీవన సౌందర్యం చిత్రీకరిస్తూ, ఆశీస్సులు పొందిన సింహాసనానికి ఆభరణంగా అమరిందని రాశారు. సిక్ఖులు ఆపైన సహరన్ పూర్, జలాలాబాద్, ముజఫర్ నగర్, ఇతర నగరాలను కలుపుకుంటూ అక్కడ అణచివేయబడ్డ జనానినికి సాంత్వన చేకూర్చారు.[16] జలంధర్, అమృత్‌సర్ జిల్లాల్లోని ఇతర ప్రాంతాల్లో సిక్ఖులు పోరాడటం ప్రారంభించారు. బందా బహదూర్ రహాన్ యుద్ధం (1710) లో మొఘలుల్ని ఓడించి రహాన్ ను గెలిచారు. రాజ్యంలో కలుపుకున్న ప్రాంతాల్లో ఆయన అవినీతిపరులైన అధికారుల్ని నిజాయితీ గలవారితో మార్చేశారు.[16]

మూలాలు

[మార్చు]
  1. Sagoo, Harbans (2001). Banda Singh Bahadur and Sikh Sovereignty. Deep & Deep Publications.
  2. Rajmohan Gandhi, Revenge and Reconciliation, pp. 117–118
  3. 3.0 3.1 3.2 3.3 Ganda Singh. "Banda Singh Bahadur". Encyclopaedia of Sikhism. Punjabi University Patiala. Retrieved 27 January 2014.
  4. "Banda Singh Bahadur". Encyclopedia Britannica. Retrieved 15 May 2013.
  5. P. N. Bali. History of Mohyals.
  6. Hakim Rai. Legend of Lachman Das,disciple of Guru Gobind Singh
  7. "Harjinder Dilgeer Banned by European Sikh Sangat". Panthic. 20 February 2009. Archived from the original on 10 ఆగస్టు 2014. Retrieved 1 August 2014.
  8. Azaad (31 August 2010). "Dilgeer At It Again!". SikhSangat. Archived from the original on 11 ఆగస్టు 2014. Retrieved 1 August 2014.
  9. History of Islam, p. 506, గూగుల్ బుక్స్ వద్ద
  10. Ralhan, O. P. (1997). The Great Gurus of the Sikhs: Banda Bahadur, Asht Ratnas etc. Anmol Publications Pvt Ltd. p. 38. ISBN 9788174884794.
  11. Singh, Teja (1999). A Short History of the Sikhs: 1469-1765. Patiala: Publication Bureau, Punjabi University. p. 79. ISBN 9788173800078.
  12. Dātā, Piārā (2006). Banda Singh Bahadur. National Book Shop. p. 37. ISBN 9788171160495.
  13. Sagoo, Harbans (2001). Banda Singh Bahadur and Sikh Sovereignty. Pennsylvania State University: Deep & Deep Publications. p. 128.
  14. Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 8. ISBN 0969409249.
  15. Grewal, J. S. (1998). The Sikhs of the Punjab. Cambridge University Press. p. 83. ISBN 9780521637640.
  16. 16.0 16.1 Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 9. ISBN 0969409249.