Jump to content

భారత రాజ్యాంగం

వికీపీడియా నుండి
భారతదేశం

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వం

రాజ్యాంగం



భారత ప్రభుత్వ పోర్టల్


భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.

రాజ్యాంగ పరిషత్

[మార్చు]
Constitution of India.jpg
భారత రాజ్యాంగ ప్రవేశిక

భారత రాజ్యాంగాన్ని తయారు చెయ్యడానికి ఒక రాజ్యాంగ సభ లేక రాజ్యాంగ పరిషత్ ను ఏర్పాటు చేసారు. ఈ సభలో సభ్యులను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకున్నారు. సభ్యుల కూర్పు ఇలా ఉన్నది:

  • రాష్ట్ర శాసనసభల ద్వారా ఎన్నికైన సభ్యులు: 292
  • భారత్ సంస్థానాల నుండి ఎన్నికైన సభ్యులు: 93
  • ఛీఫ్ కమిషనర్ ప్రావిన్సుల ప్రతినిధులు: 4

ఈ విధంగా మొత్తం సభ్యుల సంఖ్య 389 అయింది. అయితే, మౌంట్‌బాటెన్ యొక్క 1947 జూన్ నాటి దేశ విభజన ప్రణాళిక కారణంగా ఈ సభ్యుల సంఖ్య 299కి తగ్గిపోయింది. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఢిల్లీలో ఇప్పటి పార్లమెంటు భవనపు సెంట్రల్ హాలులో 1946, డిసెంబర్ 9 న జరిగింది. మొత్తం 211 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అందులో 9 మంది మహిళలు. సచ్చిదానంద సిన్హా సభకు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ పటేల్, ఆచార్య జె.బి.కృపలానీ, డా.రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, రాజాజీ, బి.ఆర్.అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య మొదలైన వారు ఈ సభలో సభ్యులు.

1947 ఆగష్టు 14 రాత్రి రాజ్యాంగ సభ సమావేశమై, కచ్చితంగా అర్ధరాత్రి సమయానికి స్వతంత్ర భారత శాసన సభగా అవతరించింది. రాజ్యాంగం రాతప్రతిని తయారు చెయ్యడం కొరకు 1947 ఆగష్టు 29 న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్టు కమిటీని ఏర్పాటు చేసింది. బి.ఆర్.అంబేద్కర్ ఈ కమిటీకి అధ్యక్షుడు[1].

రాజ్యాంగ సభ విశేషాలు

[మార్చు]
  • స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం: 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు.
  • రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాతప్రతిపై వెచ్చించింది.
  • రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది.
  • భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు[1].
  • రాజ్యాంగంపై సంతకాలు చేసే రోజున బయట చిరుజల్లు పడుతూ ఉంది. దీన్ని శుభశకునంగా భావించారు.
  • 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్ తాత్కాలిక పార్లమెంటుగా మారింది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది..

రాజ్యాంగ విశేషాలు

[మార్చు]

భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. అవతారిక, 448 అధికరణాలు, 12 షెడ్యూళ్ళతో కూడిన గ్రంథం ఇది. రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాలు, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు మొదలైన విషయాలను నిర్వచించింది. పౌరులకు, భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించి కింది వాటిని సూత్రీకరించింది:

అవసరమైనపుడు రాజ్యాంగాన్ని సవరించుకోడానికి వెసులుబాటు కలిగిస్తూ, సవరణ విధానాన్ని కూడా నిర్దేశించింది.

అవతారిక

[మార్చు]

రాజ్యాంగంలో అవతారిక ప్రముఖమైనది. రాజ్యాంగ నిర్మాణం ద్వారా భారతీయులు తమకు తాము అందివ్వదలచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పట్ల తమ నిబద్ధతను, దీక్షనూ ప్రకటించుకున్నారు.


భారతదేశ ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ క్రింది అంశాలను అందుబాటులో ఉంచాలని సంకల్పించాము:
న్యాయం - సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం;
స్వేచ్ఛ - ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ;
సమానత్వం - హోదాలోను, అవకాశాలలోను సమానత్వం;
సౌభ్రాతృత్వం - వ్యక్తి గౌరవం పట్ల నిష్ఠ, దేశ సమైక్యత సమగ్రతల పట్ల నిష్ఠ;
మా రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, ఆమోదించి, మాకు మేము సమర్పించుకుంటున్నాము[2].

మొదట్లో అవతారికలో భారత దేశాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు. అయితే 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఇది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మారింది.

ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు

భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలో ముఖ్యమైనవి

భారత రాజ్యాంగం లోని షెడ్యూళ్ళు

[మార్చు]

భారత రాజ్యంగ రూపకల్పన సమయంలో 8 షెడ్యూళ్ళు ఉండగా ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9 వ షెడ్యూల్ ను చేర్చగా, 1985లో 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో 10 వ షెడ్యూల్ ను రాజ్యాంగంలో చేర్చారు. ఆ తర్వాత 1992లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా 11, 12 వ షెడ్యూళ్ళను చేర్చబడింది.

  • 1 వ షెడ్యూల్ - భారత సమాఖ్యలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
  • 2 వ షెడ్యూల్ - జీత భత్యాలు
  • 3 వ షెడ్యూల్ - ప్రమాణ స్వీకారాలు
  • 4 వ షెడ్యూల్ - రాజ్యసభలో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల స్థానాల విభజన
  • 5 వ షెడ్యూల్ - షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన
  • 6 వ షెడ్యూల్ - ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన
  • 7 వ షెడ్యూల్ - కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన
  • 8 వ షెడ్యూల్ - రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు
  • 9 వ షెడ్యూల్ - న్యాయస్థానాల పరిధిలోకి రాని కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు జారీ చేసిన చట్టాలు
  • 10 వ షెడ్యూల్ - పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
  • 11 వ షెడ్యూల్ - గ్రామ పంచాయతీల అధికారాలు
  • 12 వ షెడ్యూల్ - నగర పంచాయతి, పురపాలక సంఘాల అధికారాలు

ఆత్మరక్షణ

[మార్చు]

సవరణలు

[మార్చు]

రాజ్యాంగంలో మార్పులకు, చేర్పులకు, తొలగింపులకు సంబంధించి పార్లమెంటుకు రాజ్యాంగం అపరిమితమైన అధికారాలిచ్చింది. రాజ్యాంగం నిర్దేశించినదాని ప్రకారం సవరణలను క్రింది విధంగా చెయ్యాలి:

  • పార్లమెంటు ఉభయసభల్లోను సవరణ బిల్లు ఆమోదం పొందాలి.
  • సభలో హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల ఆధిక్యత, మొత్తం సభ్యుల్లో సాధారణ ఆధిక్యతతో మాత్రమే బిల్లు ఆమోదం పొందుతుంది.
  • అయితే ప్రత్యేకించిన కొన్ని అధికరణాలు, షెడ్యూళ్ళకు సంబంధించిన సవరణల బిల్లులు పార్లమెంటు ఉభయసభలతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో కనీసం సగం సభలు కూడా కచ్చితంగా ఆమోదించాలి.
  • పై విధానాల ద్వారా ఆమోదం పొందిన బిల్లులు రాష్ట్రపతి సంతకం అయిన తరువాత, సంతకం అయిన తేదీ నుండి సవరణ అమలు లోకి వస్తుంది.

2012 ఏప్రిల్ వరకు రాజ్యాంగానికి 100 సవరణలు జరిగాయి. అవతారికలోను, సవరణ విధానంలోను కూడా సవరణలు జరిగాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Stages of Constitution Making". Constitution of India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-04-14.
  2. http://www.nits.ac.in/NewsUpdates/Premable.pdf