వికీమీడియా ఫౌండేషన్: సార్వత్రిక ప్రవర్తనా నియమావళి
ఈ విధానాన్ని వికీమీడియా ఫౌండేషన్ ధర్మకర్తల మండలి ఆమోదించారు. ఇది వికీమీడియా ఫౌండేషన్ అధికారులు లేదా సిబ్బంది లేదా ఏ వికీమీడియా ప్రాజెక్ట్ యొక్క లేదా స్థానిక విధానాలు దాటవేయకూడదు, క్షీణించకూడదు లేదా విస్మరించకూడదు. |
మనకు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఎందుకు?
వికీమీడియా ప్రాజెక్టులు, ప్రదేశాలలో వీలైనంత చురుకుగా పాల్గొనడానికి తగినట్లుగా ఎక్కువ మందికి సాధికారత కల్పించడం, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని పంచుకోగల అవకాశం కల్పించడమే వికీమీడియా ఫౌండేషన్ లక్క్ష్యం. మన వాడుకరుల(కాంట్రిబ్యూటర్ల)సంఘాలు వైవిధ్యమైనవిగాను, కలుపుకొని పోయేవి, సాధ్యమైనంత అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ సంఘాలలో చేరాలనుకునే ఎవరికైనా సానుకూలము, సురక్షితము, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని అనుకుంటున్నాము. ఈ ప్రవర్తనా నియమావళిని స్వీకరించడం, అవసరమైన నవీకరణలను పునఃసమీక్షించడం ద్వారా ఈ నియమావళిని కొనసాగేలా చూస్తాము. అలాగే, రచనలను (కంటెంట్) దెబ్బతీసే వారు లేదా వక్రీకరించే వారి నుండి మా ప్రాజెక్టులను రక్షించాలని మేము కోరుకుంటున్నాము.
వికీమీడియా లక్ష్యానికి అనుగుణంగా, ఆయా ప్రాజెక్టులు, ప్రదేశాలలో పాల్గొనే వారందరూ
- ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని స్వేచ్ఛగా పంచుకోగల ప్రపంచాన్ని సృష్టించడంలో సహాయపడతారు
- ప్రపంచవ్యాప్తంగా సమాజంలో భాగమయి పక్షపాతాన్ని నివారిస్తారు
- అన్ని పనులలో ఖచ్చితత్వం, ధృవీకరణ కోసం కృషి చేస్తారు.
ఈ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి (యు.సి.ఒ.సి) ఆమోదయోగ్యము ఇంకా ఆమోదయోగ్యంకాని ప్రవర్తనకు మార్గదర్శకాలను నిర్వచిస్తుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ వికీమీడియా ప్రాజెక్టులు, ప్రదేశాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది. దీనిలో కొత్తవారు, అనుభవజ్ఞులైన వాడుకరులు, ప్రాజెక్టులలో పనిచేసేవారు, కార్యక్రమాలు నిర్వహించేవారు(ఈవెంట్ ఆర్గనైజర్లు), కార్యక్రమాలలో పాల్గొనేవారు, ఉద్యోగులు, అనుబంధ సంస్థల బోర్డు సభ్యులు, వికీమీడియా ఫౌండేషన్ బోర్డు సభ్యులు ఉన్నారు. ఇది అన్ని వికీమీడియా ప్రాజెక్టులు, సాంకేతిక ప్రదేశాలు, వ్యక్తిగత, ఆన్లైన్ కార్యక్రమాలకు (వర్చువల్ ఈవెంట్లు), అలాగే ఈ క్రింది సందర్భాలకు కూడా వర్తిస్తుంది:
- వ్యక్తిగతం, బహిర్గతం, పాక్షికంగా బహిర్గతమైన సంభాషణలు
- సంఘ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాల చర్చలు, సంఘీభావ వ్యక్తీకరణలు
- సాంకేతిక అభివృద్ధి సమస్యలు
- కంటెంట్ సహకారం
- బాహ్య భాగస్వాములతో అనుబంధ సంస్థలు/సంఘాలు ప్రాతినిధ్యం వహించే సందర్భాలు.
1 - పరిచయం
ప్రపంచవ్యాప్తంగా వికీమీడియా ప్రాజెక్టుల సహకారానికి సార్వత్రిక ప్రవర్తనా నియమావళి, ప్రవర్తనే మూలాధారం. సమూహాలు(కమ్యూనిటీ) ఇక్కడ పేర్కొన్న కనీస ప్రమాణాలను కొనసాగిస్తూ, స్థానిక, సాంస్కృతిక సందర్భాన్ని పరిగణనలోకి తీసుకుని తమ విధానాలను అభివృద్ధి చేయవచ్చు.
సార్వత్రిక ప్రవర్తనా నియమావళి వికీమీడియన్లందరికీ ఎలాంటి మినహాయింపులు లేకుండా సమానంగా వర్తిస్తుంది.నియమావళికి విరుద్ధమైన చర్యలు ఆంక్షలకు దారితీస్తాయి. నియమించిన కార్యకర్తలు లేదా వికీమీడియా ఫౌండేషన్ వారి చట్టపరమైన వేదికల యజమాని కానీ ఈ ఆంక్షలను విధించవచ్చు.
2 - ఆమోదయోగ్యమైన (ఆశించిన) ప్రవర్తన
ప్రతి వికీమీడియన్, వారు కొత్తవారు లేదా అనుభవజ్ఞుడైన వాడుకరి(ఎడిటర్), సమూహంలో కార్యకర్తలు (కమ్యూనిటీ ఫంక్షనరీ), వికీమీడియా ఫౌండేషన్ బోర్డుకి అనుబంధమున్నవారు కానీ సభ్యుడు లేదా ఉద్యోగి అయినప్పటికీ వారి ప్రవర్తనకు వారే బాధ్యులవుతారు.
అన్ని వికీమీడియా ప్రాజెక్ట్‌లు, ప్రదేశాలు, కార్యక్రమాలలో గౌరవం, నాగరికత, సంఘటితత్వం, సంఘీభావం, మంచి పౌరసత్వం ఆధారంగా వారి ప్రవర్తన గుర్తిస్తారు. వయస్సు, మానసిక శారీరక వైకల్యాలు, రూపం, జాతీయత, మతం, జాతి, సాంస్కృతిక నేపథ్యం, కులం, సామాజిక తరగతి, భాష ధారాళంగా మాట్లాడగలగడం, లైంగిక దృక్పథం, లింగం గుర్తింపు, వారి వృత్తి ఆధారంగా ఎలాంటి తేడా లేకుండా, వాడుకరులుగా పాల్గొనేవారందరికీ ఇది వర్తిస్తుంది. అంతేకానీ వికీమీడియా ప్రాజెక్టులు లేదా ఉద్యమాలలో నిలబడిన వారు, నైపుణ్యాలు కలిగినవారు లేదా సాధించిన విజయాల ఆధారంగా మేము మినహాయింపులు ఇవ్వము.
2.1 - పరస్పర గౌరవం
వికీమీడియన్లు అందరూ ఇతరులపట్ల గౌరవంగా మెలగాలి.ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ వికీమీడియా వాతావరణాల్లో వ్యక్తులతో సంప్రదించేడప్పుడు, మేము ఒకరినొకరు పరస్పర గౌరవంతో మెలుగుతాము.
ఈ క్రింద ఇచ్చినవి సంబంధించిన కొన్ని అంశాలు, అవి మాత్రమే పరిమితం కావు.
- సానుభూతిని అలవర్చుకోండి. వినండి, విభిన్న నేపథ్యాలకు చెందిన వికీమీడియన్లు మీకు ఏమి చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక వికీమీడియన్ గా మీ స్వంత అవగాహన, అంచనాలు, ప్రవర్తనను అలవర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి.
- మంచి విశ్వాసాన్ని ఏర్పరచుకోండి. నిర్మాణాత్మకమైన సవరణలలో నిమగ్నమవ్వండి; మీ రచనలు, సవరణలు (కాంట్రిబ్యూషన్) ప్రాజెక్ట్ లేదా పని నాణ్యతను మెరుగుపరచాలి. దయతో, మంచి విశ్వాసంతో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, స్వీకరించండి.ఆధారాలు లేనట్లయితే విమర్శలను సున్నితంగా, నిర్మాణాత్మకంగా అందించాలి. ప్రాజెక్టులను మెరుగుపరచడానికి ఇక్కడ సహకారించడానికి ఇతరులు ఉన్నారని వికీమీడియన్లందరూ భావించాలి. కానీ ఈ ప్రకటనలను హానిచేసే ఉద్దేశ్యంతో సమర్థించకూడదు.
- వాడుకరులు తమ పేరు వివరించుకునే విధానాన్ని గౌరవించండి. తాము వివరించుకోవడానికి నిర్దిష్ట పదాలను ఉపయోగించవచ్చు. సంభాషించేటప్పుడు లేదా వారి గురించి ప్రస్తావించేటప్పుడు భాషాపరంగా లేదా సాంకేతికంగా ఈ పదాలను గౌరవసూచకంగా, ఉపయోగించండి. ఉదాహరణకి:
- చారిత్రాత్మకంగా చూస్తే కొన్ని జాతి సమూహాలు తమను తాము వివరించడానికి ఒక నిర్దిష్ట పేరును ఉపయోగించవచ్చు;
- ప్రజలు వారి భాష నుండి ఉపయోగించే అక్షరాలు, శబ్దాలు లేదా పదాలను ఉపయోగించే పేర్లు మీకు తెలియనివి కావచ్చు.
- వ్యక్తులు విభిన్న పేర్లు లేదా సర్వనామాలను ఉపయోగించి ఒక నిర్దిష్ట లింగ గుర్తింపుతో ఉంటారు.
- నిర్దిష్ట శారీరక మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులు తమను వివరించుకోవడానికి నిర్దిష్ట పదాలను ఉపయోగించవచ్చు
- వ్యక్తిగత సమావేశాల్లో, మనం ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతాము. ప్రతి ఒక్కరి ప్రాధాన్యతలు, సరిహద్దులు, సున్నితత్వం, సంప్రదాయాలు, అవసరాల పట్ల శ్రద్ధగా గౌరవంగా ఉంటాము.
2.2 - నాగరికత, సమిష్టితత్వం, పరస్పర మద్దతు, మంచి పౌరసత్వం
దిగువ పేర్కొన్న ప్రవర్తనల కోసం మేము కృషి చేస్తాము -
- నాగరికత అంటే వ్యక్తులతో, అపరిచితులతో సహా మర్యాదగా ప్రవర్తించడము ఇంకా సంభాషించడము.
- కొలీజియాలిటీ అంటే ఉమ్మడి కార్యక్రమంలో పని చేస్తున్న వ్యక్తులు ఒకరికొకరు అందించే స్నేహపూర్వక మద్దతు.
- పరస్పర మద్దతు, మంచి పౌరసత్వం అంటే వికీమీడియా లక్ష్యానికి దోహదం చేసేలా, చురుకుగా బాధ్యత వహించుతూ వికీమీడియా ప్రాజెక్ట్‌లు, ఉత్పాదకత, ఆహ్లాదకరమైన సురక్షితమైన ప్రదేశాలు, ఉండేటట్లుగా చూసుకుంటూఉండడం.
ఈ క్రింద పేర్కొన్న అంశాలు మాత్రమే పరిమితం కావు:
- మార్గదర్శకత్వం, శిక్షణ కొత్తవారికి తాము ఏమి చేయాలో కనుగొనడానికి అవసరమైన నైపుణ్యాలను పొందడంలో సహాయపడటం.
- తోటి వాడుకరులకు (కాంట్రిబ్యూటర్స్) మద్దతు- అవసరమైనప్పుడు చేయూతనివ్వండి. వారు ఆశించిన విధంగా వ్యవహరించనప్పుడు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ప్రకారం వారి కోసం మాట్లాడండి.
- వాడుకరులు (కాంట్రిబ్యూటర్స్) చేసిన పనిని గమనించి, వారికీ గుర్తింపునివ్వండి - వారు చేసిన సహాయానికి, పనికి ధన్యవాదాలు తెలపండి. వారి ప్రయత్నాలను ప్రశంసించండి, అవసరమైన చోట గుర్తింపు ఇవ్వండి.
3 - ఆమోదయోగ్యం కాని ప్రవర్తన
సార్వత్రిక ప్రవర్తనా నియమావళి లక్ష్యం సమూహ సభ్యులకు అనుసరించకూడని ప్రవర్తన, పరిస్థితులను గుర్తించడంలో సహాయపడటము. వికీమీడియా ఉద్యమంలో ఈ కింద పేర్కొన్న ప్రవర్తనలు ఆమోదయోగ్యం కాదని భావిస్తారు:
3.1 – వేధింపులు
ప్రధానంగా ఒక వ్యక్తిని భయపెట్టడానికి, ఆగ్రహం కలిగించడానికి లేదా కలత పెట్టడానికి ఉద్దేశించిన ప్రవర్తనను వేధింపు అంటారు. ఒక సాధారణమైన వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల సాంస్కృతిక వాతావరణాలలో భరించగలిగిన దానికంటే మించిన అటువంటి ప్రవర్తనను వేధింపుగా పరిగణిస్తారు. ఇవి తరచుగా భావోద్వేగ వేధింపులుగా ఉంటాయి. ముఖ్యంగా దౌర్బల్యస్థితిలో ఉన్న వ్యక్తులను భయపెట్టడానికి లేదా ఇబ్బంది పెట్టడానికి వారు పనిచేసే ప్రదేశాలలో, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంభాషించడం కూడా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో, మొదటలో వేధింపుల స్థాయికి ప్రవర్తన ఉండక పోయినా సంఘటనల పునరావృతం ద్వారా అది వేధింపుగా పరిగణించవచ్చు. ఈ క్రింది కొన్ని రకాల వేధింపులు పేర్కొన్నారు,అయితే అవి మాత్రమే పరిమితం కావు.
- అవమానాలు: ఇందులో పేరుతో ప్రస్తావించడం, స్లర్స్ లేదా మూస పద్ధతులను ఉపయోగించడం, వ్యక్తిగత లక్షణాల ఆధారంగా ఏదైనా దాడులు చేయటం వంటివి ఉంటాయి. అవమానాలు అంటే తెలివితేటలు, ప్రదర్శన, జాతి, మతం, సంస్కృతి, కులం, లైంగిక ధోరణి, లింగం, వైకల్యం, వయస్సు, జాతీయత, రాజకీయ అనుబంధం లేదా ఇతర లక్షణాలను ఆధారంగా చేసే సూచనలు. కొన్ని సందర్భాల్లో పదేపదే ఎగతాళి, వ్యంగ్యం లేదా దూకుడు వంటివి వ్యక్తిగత ప్రకటనలు చేయకపోయినా, సమిష్టిగా అవమానాలను కలిగిస్తాయి.
- లైంగిక వేధింపులు:లైంగిక పరమైన శ్రద్ధ లేదా వ్యక్తి సహేతుకంగా ఇష్టపడకపోయినా లేదా సమ్మతి తెలియజేయని పరిస్థితులలో పురోగతి అవడం వంటి వాటిని వేధింపు అని అంటారు.
- బెదిరింపులు: అంటే కోరుకున్న విధంగా ప్రవర్తించమని ఎవరినైనా బలవంతం చేయడం, శారీరక హింస, ఇబ్బంది కలిగించడము, అన్యాయంగా పేరు ప్రఖ్యాతులకు హాని తలపెట్టడం లేదా హాని సంభావ్యతను స్పష్టంగా లేదా పరోక్షంగా సూచించడం.
- ఇతరులకు హాని కలిగించే విధంగా ప్రోత్సహించడం: స్వీయ-హాని కొరకు లేదా ఆత్మహత్యకు ఇతరులను ప్రేరేపించడంతోపాటు, హింసాత్మక దాడులు చేయమని వేరొకరిని ప్రోత్సహించడం.
- వ్యక్తిగత డేటా బహిర్గతం చేయడం (డాక్సింగ్):అంటే వికీమీడియా ప్రాజెక్ట్‌లలో లేదా మరెక్కడైనా ఇతర వాడుకరుల వ్యక్తిగత సమాచారం - పేరు, ఉద్యోగ స్థలం, చిరునామా లేదా ఇమెయిల్ వంటి సమాచారాన్ని, ఇంకా ప్రాజెక్టుల వెలుపల వారి వికీమీడియా కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని వారి అనుమతి లేకుండా పంచుకోవడం.
- హౌండింగ్: అంటే ప్రాజెక్ట్(ల) అంతటా ఒక వ్యక్తిని అనుసరించడం. ప్రధానంగా వారిని కలవరపెట్టే లేదా నిరుత్సాహపరిచే ఉద్దేశ్యంతో వారి పనిని పదేపదే విమర్శించడం. సంభాషించడానికి, అవగాహన కల్పించడానికి చేసిన ప్రయత్నాల తర్వాత కూడా సమస్యలు కొనసాగుతూ ఉంటే, సమూహాలు అనుసరిస్తున్న ప్రక్రియల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది.
- ట్రోలింగ్: సంభాషణలకు అంతరాయం కలిగించడం లేదా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడానికి చెడు ఆలోచనతో టపా(పోస్ట్) చేయడం.
3.2 - అధికారాన్ని, ప్రత్యేక హక్కును లేదా పరపతిని దుర్వినియోగం చేయడం
ఎవరైనా నిజంగా తమకున్న అధికార ప్రభావం వలన, ఇతర వ్యక్తుల పట్ల అగౌరవంగా, క్రూరంగా లేదా హింసాత్మకంగా ప్రవర్తించినప్పుడు అధికార దుర్వినియోగం జరుగుతుంది. వికీమీడియా వాతావరణంలో, ఇది పదాలతో కానీ లేదా మానసిక వేధింపుల రూపంలో ఉండవచ్చు.
- కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది తమ కార్యాలయ దుర్వినియోగం: వికీమీడియా ఫౌండేషన్ లేదా వికీమీడియా అనుబంధ సంస్థల అధికారులు, కార్యదర్శులు, సిబ్బంది ఇతరులను భయపెట్టడానికి లేదా బెదిరించడానికి తమ అధికారం, జ్ఞానం ఇంకా వనరులను వినియోగించడం.
- పెద్దరికం (సీనియారిటీ), సంబంధాల దుర్వినియోగం: అంటే ఇతరులను భయపెట్టడానికి తమ స్థానం, ఖ్యాతిని ఉపయోగించడం. ఉద్యమంలో గణనీయమైన అనుభవం, సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు ప్రత్యేక శ్రద్ధతో ప్రవర్తిస్తారని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే వారు చేసే అనాలోచిత వ్యాఖ్యలు ఎదురుదెబ్బను తగిలిగిస్తాయి. సమూహానికి అధికారులు వారితో విభేదించే వారిపై దాడి చేయడానికి వారికున్న ప్రత్యేక హక్కును దుర్వినియోగం చేయకూడదు.
- మానసికంగా తారుమారు చేయడం (మేనిప్యులేషన్):అంటే దురుద్దేశపూర్వకంగా ఎవరినైనా గెలవాలనే లక్ష్యంతో వారి ప్రత్యక్షానుభవములను, ఇంద్రియాలను లేదా తమ అవగాహనను అనుమానించుకునేలా చేయడం లేదా మీరు కోరుకున్న విధంగా ప్రవర్తించేలా వారిని బలవంతం చేయడం.
3.3 - కంటెంట్ విధ్వంసం, ప్రాజెక్టుల దుర్వినియోగం
ఉద్దేశ్యపూర్వకంగా లేదా పక్షపాతంతో, తప్పుడు విషయాన్ని లేదా సముచితం కాని కంటెంట్‌ను పరిచయం చేయడం, కంటెంట్ సృష్టి లేదా నిర్వహణకు ఆటంకం కలిగించటం, అడ్డగించడం వంటివి ఉంటాయి, అయితే ఇవే పరిమితం కాదు:
- సముచితమైన చర్చ లేదా వివరణ ఇవ్వకుండానే ఏదైనా కంటెంట్ ని పదేపదే ఏకపక్షంగా తొలగించడం
- వాస్తవాలు లేదా నిర్దిష్ట దృక్కోణాలు, వివరణలకు అనుకూలంగా కంటెంట్‌ను క్రమపద్ధతిలో తారుమారు చేయడం, విశ్వాసఘాతుకంగా లేదా ఉద్దేశపూర్వకంగా మూలాలను తప్పుగా అందించడం, సంపాదకీయ కంటెంట్‌ను రూపొందించే సరైన మార్గాన్ని మార్చడం వంటివి.
- వ్యక్తులను లేదా సమూహాలను వారి వ్యక్తిగత నమ్మకాల ఆధారంగా అవమానపరచడం, ద్వేషాన్ని ప్రేరేపించడం కోసం ఎవరైనా ఏ రూపంలోనైనా, లేదా ఏ భాషలోనైనా వివక్షతతో ద్వేషపూరిత ప్రసంగం చేయడం
- విజ్ఞానసర్వస్వ సమాచారం వినియోగించేటప్పుడు సంబంధం లేకుండా ఇతరులను భయపెట్టేవి, హాని కలిగించే చిహ్నాలు, చిత్రాలు, వర్గాలు, ట్యాగ్లు లేదా ఇతర రకాల కంటెంట్ల ఉపయోగించడం. ఇందులో ఉద్దేశించిన కంటెంట్ తగ్గించడానికి లేదా బహిష్కరించడానికి నిర్దుష్ట పథకాలను తయారుచేయడం వంటివి ఉంటాయి.